Subscribe:

Saturday, April 23, 2011

శ్రమైకజీవన సౌందర్యం

మీరు రాంబాబు డైరీ చదివారా ? ఆగండి ! మీ తిట్లతో నా చెవులు చిల్లులు పడుతున్నాయి.  ఆ శ్రమైకజీవన సౌందర్యం అన్న హెడ్డింగ్ ఏంటి , రాంబాబు డైరీ చదివారా అన్న ప్రశ్నకి సంబంధం ఏమిటి అసలా మాటకొస్తే ఆ రాంబాబు గాడు ఎవడు అనే గా మీ సందేహం? చెప్తానండి ! ఒక్క క్షణం.

రాంబాబు డైరీ అనేది నండూరి పార్ధసారధి గారు రాసిన ఒక పుస్తకం పేరండి. ఆ సరే ఐతే ఆ పుస్తకానికి ఈ శ్రమైకజీవన సౌందర్యంకి సంబంధం ఏంటి అనేగా ఇప్పుడు మీ ప్రశ్న?  ఆ వివరాలలోకే వస్తున్నా . ఈ రాంబాబు డైరీ ల మొదటి బాగం మూడు సంవత్సరాల క్రితం నేను ఇండియాలో ఉన్నప్పుడు చదివాను. అది మొదటిసారి నేను చూసింది నేను చిక్కడపల్లి లైబ్రరీ లో (ఇప్పుడు ఆ లైబ్రరీ గురించి తెలిసిన వాళ్ళు సందేహపడకండి ఒక్కోసారి అంతే లక్కు లాగిపెట్టి తంతే మనం వెళ్లి బూరెల బుట్టలో పడతాం ). ఆ పుస్తకాన్ని మొదటి సారి చదవగానే నేను అర్జెంటు గా చేసిన పని , విశాలాంధ్ర  కెళ్ళి అది సంపాదించటం ఎందుకు అనుకుంటారేమో ఆ రాంబాబు కి ఉన్న సందేహలలో కొన్ని నాకు ఉన్నాయి మరి ఆయన వాటిని డైరీలో రాసుకున్నాడు, నాకు రాయటానికి బద్ధకం అందుకే రాసే పని తప్పుతుంది అని కొనేసుకున్నా :)

అందులో మచ్చుకి కొన్ని :
1.దేశంలో ఔషదాల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ , ఎన్ని టానిక్కులు ఉత్పత్తి అవుతున్నప్పటికీ బలహీన వర్గాల పరిస్తితి ఎందుకు మెరుగుపడటం లేదు ?
2.షాపింగ్ అంటే షాప్ కి వెళ్లి కొనటం ఐతే , మార్కెటింగ్ అంటే మార్కెట్ కి వెళ్లి కొన్నుకోవటం ఎందుకు కాదు ?
3.దున్నేవాడిది భూమి అంటున్నారు రైతులు , రేపు బట్టలు ఉతికే వారు ఉతికేవాడిది బట్ట అనొచ్చు , తల క్రాఫింగ్ చేసే వారు గోరిగే వాడిది తల అని వాదించరు అని గ్యారెంటి ఏమిటి ?

  • సరే, సందేహాల సంగతి పక్కన పెడితే అనుభూతుల సంగతి చూద్దాం ఎంత సిన్సియర్ గా చెబుతాడో
    గ్రీష్మ ఋతువులో మధ్యాహాన్నం పాడే ముల్తానీ రాగం వింటే వేసవి కాలం మిట్ట మధ్యాహన్నం చెమటలు పోస్తుంటే బామ్మ గారు ఆవలిస్తూ గచ్చునేల మీద చెంగు పరుచుకొని పడుకుని ఆవలిస్తూ ఈగలు తోలుకుంటూ విసిన కర్రతో విసురుకుంటున్నట్లు ఉండటం (మామూలు జనాలకైతే ప్రియుని కోసం ఎదురుచూసే ప్రియురాలి విహార వేదన తెలియాలి ) .

  • ఇక మచ్చుకి మన రాంబాబు ప్రతిపాదించిన సిద్దాంతం :
    అవతలి వాడికి తెలిసిన విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు , అవతలి వాడికి ఏది తెలియదు అని మనకి గట్టిగా తెలుసో దాన్ని గురించి మనకి తెలియకపోయినాసరే అనర్గళం గా మాట్లాడొచ్చు అందుకని అవతలి వాడికి ఏది తెలియదో అది తెలుసుకోవాలి ముందు .

ఈ పైవి చదివితే మనలోని రాంబాబుని ఒకసారి చదవాలి అనిపించటం లేదు ?! అనిపిస్తుంది కదా :) అందుకే నేను జనవరి లో వెళ్ళినప్పుడు రాంబాబు డైరీ రెండో బాగం దొరకబుచ్చుకుని నా వెంట తెచ్చుకున్నా. ఇక అప్పటినుంచి ఒక రెండు నెలలు పని పని , కాని చదవాలన్న కోరిక.  సరే ఆ బాధ తట్టుకోలేక ఎలాగోలా , రాంబాబు డైరీ తో పాటు ఇంకొక రెండు పుస్తకాలు హడావుడిగా ముద్దలు ముద్దలు మింగుతాం చూడండి అలా కానిచ్చేసా .

ఇక వారంతం మాకు గుడ్ ఫ్రైడే సందర్భం గా పొడుగాటి వారంతం , పైగా ఆఫీసులో కూడా ఒక పది రోజుల నుంచి తగ్గిన పని ఒత్తిడి వీటితో గురువారం సాయంత్రమే డిసైడ్ అయిపోయాను ఈ మూడు రోజులు కాలు తీసి బయట పెట్టకూడదు , పర్స్ లోంచి ఒక్క సెంట్ కూడా ఖర్చు చేయకూడదు అని . అంతే నిన్న , ఈవాళ పండగ రాంబాబు డైరీ రెండో బాగం మళ్ళీ తీరిగ్గా చదివేసా , ఇంకొక కొత్త బ్లాగు మొదలెట్టేసా. కొన్ని రోజులు పని తరవాత వచ్చే తీరిక సమయాన్ని ఈ మూడు రోజులు క్షణం కూడా వృధా చేయకుండా ఎంజాయ్ చేస్తున్నా , ఇప్పుడు అర్ధం అయ్యిందా మీకు ఈ పోస్టుకు ఆ హెడ్డింగ్ ఎందుకు అనేది :)

అలాగే శ్రమలో ఆనందాన్ని అనుభవించటమే కాదు శ్రమించే వారిని అభినందించటం కూడా మంచి పని కాబట్టి :

విజయవంతం గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంత్సరంలోకి అడుగు పెట్టిన శుభసందర్భం లో మాలిక టీం మెంబెర్స్ కి శుభాకాంక్షలు . చిన్నారి మాలిక కు బెలేటేడ్ హ్యాపీ బర్త్ డే !

మాలిక , మాలిక ప్రతిక , వనితా మాలిక ఇవే కాకుండా మీరు మరన్ని విజయవంతమైన పనులు చేయాలి అని మనస్పూరిగా గా కోరుకుంటున్నా !