Subscribe:

Friday, March 8, 2013

సిరిసిరిమువ్వ - ఒక విజేత



చూడటానికి నాజూకైన మల్లెతీగంత సుకుమారి..
బోల్డంత -- అభిమానం... ఆపేక్ష... అప్యాయత...
స్వచ్చమైన -- చిరునవ్వు.. పలకరింపు.. ప్రోత్సాహం.. అన్నీ కలగలసిన మృదుస్వభావి!!

                                            నిషిగంధ 

ఇలాంటి ప్రత్యేకత కలిగిన అందమైన వ్యక్తితో పరిచయం అయితే మనకి చాల సంతోషంగా ఉంటుంది కదూ ? మరి ఆ సంతోషాన్ని చుట్టూ ఉన్నవాళ్ళతో పంచుకుంటే? అది   రెట్టింపవుతుంది .  అందుకే నా సంతోషాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఆ అందమైన వ్యక్తి మీలో చాలా మందికి తెలిసినా సరే మరోసారి నా మాటల్లో పరిచయం చేయాలి అని నా ఈ ప్రయత్నం. 

అసలు ఈ వ్యక్తి తో నా పరిచయం ఎలా అయ్యిందో మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం, కొంచెం అంటే కొంచెం నాతొ పాటుగా నా జ్ఞాపకాలతో వెనక్కి ప్రయాణం చేయాలి. అవి నేను కొత్త కొత్త గా బ్లాగులు చదువుతున్న రోజులు, అప్పుడు ఒకసారి ఇదేనా పరిష్కారం అనే పోస్టు చూసి ఒకింత ఆవేశం గానే ఆ పోస్ట్ లో కంటెంట్ కి వ్యతిరేకంగానే కామెంట్ రాసాను. ఆ బ్లాగ్ లో కామెంట్ రాయటం అదే మొదటిసారి కానీ , ఆ బ్లాగ్ మాత్రం కొత్త కాదు అప్పటికే ఆ బ్లాగ్ మొత్తం తిరగేసాను  కాబట్టి. అలా మొదటి కామెంట్ కొంచెం వ్యతిరేకం గా రాసినప్పటికీ తర్వాత తర్వాత మాత్రం ఆ బ్లాగ్ మీద అభిమానం పెరిగింది. మరీ ముఖ్యంగా ఆవిడ రాసే వాళ్ళ ఊరికబుర్లు, జ్ఞాపకాలు, సమాజం గురించి ఆలోచనలు ఇవి మరింతగా  అభిమానం పెంచాయి. అన్నట్లు ఈ పోస్టు నాకు చాలా చాలా ఇష్ట మండోయి.


ఆ తరవాత బజ్ , ప్లస్ ఆవిడ బ్లాగుతోనే కాకుండా ఆవిడతో నా పరిచయం పెంచేసాయి. చాలా సార్లు మరీ ముఖ్యం గా ఆన్లైన్ లో మనకి వ్యక్తిగత పరిచయం పెరిగే కొద్ది , అప్పటి వరకు  ఎదుటి వ్యక్తి ఏవన్నా  అందమైన మాయపొరలు కప్పుకుని ఉంటే అవి కరిగిపోవటం మొదలయ్యి అసలు రూపం పరిచయం అవుతుంది. ఆవిడ మాత్రం ఆ పరిచయం పెరిగే కొద్దీ మరింత అందంగా కనిపించారు. అదుగో అప్పుడే ఆవిడ పిల్లల గురించి రాసిన పోస్టులు నాకు ఆవిడ మీద మరింత అభిమానాన్ని పెంచాయి.

మరి అక్కడితో ఆగిపోయిందా ? లేదు !  ఆవిడ కాన్సర్ గురించి రాసిన ఈ సిరీస్ లో  మొదటి పోస్ట్ చదివినప్పుడు నివ్వెరపోయాను.  నాకు ఆవిడ బ్లాగ్ తో పరిచయం ఉన్న కారణం గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఏదో ఆరోగ్యపరమైన సమస్య ఉంది అని తెలుసు, కానీ అది కాన్సర్ అని మాత్రం ఊహించలేదు. ఒక్కొక పోస్ట్ చదువుతున్న కొద్దీ ఆవిడ ఆ సమస్యని ఎదుర్కున్న తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. ఆవిడ ధైర్యం  కన్నా,  తనకే ఎందుకు రావాలి అన్న ఆలోచన గానీ,  అయ్యో ఇలా జరిగిందేంటి  అన్న సెల్ఫ్ సింపతి కానీ లేకుండా తన శరీరం లో ఏమి జరుగుతుంది అన్న విషయం గురించి క్షుణ్ణం గా తెలుసుకోవటానికి చేసిన ప్రయత్నం చాలా చాలా నచ్చింది.  ఆవిడ తనకొచ్చిన ఆరోగ్యసమస్యని ఎదుర్కొన్న తీరు మనం చదివే కొన్ని పుస్తకాలలోని,   చూసే సినిమాల్లో ధీరొధాత్తమైన పాత్రలకి ఏ మాత్రం తీసిపోదు.  ఇదంతా ఒక ఎత్తు అయితే  వేరే వాళ్ళకి ధైర్యం, అవేర్నెస్ కలిగించాలి అన్న సదుద్దేశ్యం తో అప్పుడు పడిన బాధని,  మర్చిపోవాల్సిన చేదు జ్ఞాపకాలని  మరోసారి గుర్తు చేసుకుని మరీ తన బ్లాగ్ లో అక్షరబద్ధం చేయడం నాకు చాలా చాలా నచ్చింది. ఇదంతా చదివిన తరవాత ఇప్పటికవరకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అదేలెండి రాస్తున్నానో మీకు అర్ధం అయిపొయింది కదా ? ఊ ఊ మీరు కరెక్టే ఇదంతా సిరిసిరిమువ్వగా మనకు పరిచయం అయిన వరూధిని గారి గురించే.

ఊ ..... వరూధిని గారు & ఇంకా ఈ పోస్ట్ చదువుతున్న మిత్రులు, ఇలా నేను చెప్పుకుంటూ పోవటం కాదు కానీయండి, వరూధినిగారికి ఇష్టమైన, అలాగే వరూధిని గారిని అభిమానించే మన మిత్రులు, ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్న సందేశాలని ఈ క్రింద చూడండి . అన్నట్లు వరూధిని గారు, వీటిల్లో మీకో ప్రత్యేకమైన విజ్ఞప్తి ఉందండోయ్!  మరీ భాద్యతలు అన్నీ మీరే భరించేస్తున్నారు అని బాధ పడుతున్నారు ఎవరో, కొంచెం వారి విజ్ఞప్తిని ప్రత్యేకంగా పరిశీలించండి మరి :-)



ఇంత మంది ఇంత అందంగా చెప్పిన తరవాత ఇక నేను చెప్పటానికి ఏముందండి? అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను :-)

వరూధిని గారు, మీలాంటి అరుదైన విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వారితో పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉహు కాదు కాదు చాలా గర్వంగా ఉందండి. అమావాస్య, పౌర్ణమిలలాగా మనజీవితంలో సంతోషంతో పాటు బాధని కూడా కొద్ది రోజులు రుచిచూడాల్సిందే అనుకుంటే, మీరు అమావాస్య లాంటి చీకటి రోజులని ధైర్యంగా ఎదుర్కున్నారు కాబట్టి, కొత్తావకాయ గారు చెప్పినట్లు జీవితం మీద ప్రేమ ఉన్న మీకు  ఇక ముందు ముందు రోజులన్నీ ఆనందదాయకంగా గడవాలి, అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .

-శ్రావ్య 

ఇంత అందమైన శుభాకాంక్షలు అందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఆ శుభాకాంక్షలని ఇంత అందంగా ఒక దగ్గర పేర్చి మాలనల్లిన  నిషికి స్పెషల్ థాంక్స్ ! చదువరి గారు many Thanks !