Subscribe:

Thursday, January 27, 2011

అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?

ఏంటో ఇప్పుడు బ్లాగుల్లో వృతుల టాపిక్ బాగా హాట్ అనుకుంటా కదూ ? . ఏది క్లిక్ ఐతే దానికి వెనకే పరిగెత్తే తెలుగు జాతిలో పుట్టి ఇప్పుడు నేను దీని మీద ఒక పోస్టు రాయకపోతే నా ఐడెంటిటీ కే ప్రాబ్లం . సరేలెండి ఈ సోదంతా ఎందుకు కాని ఒకవేళ మీకు ఈ టపా బాక్గ్రౌండ్ తేలియకపోతే మంచు గారు ,  వేణు బాబు గారు రాసినవి ఒక చూపు చూసి వచ్చేయండి . ఇక మీకు మనం మన బుర్రలు ఎందుకు బద్దలు కొట్టుకోబోతున్నామో అర్ధం అయ్యింది కదా :)

సరే మీరందరూ ఆదిత్య 369 అదేంటండీ అలా చూస్తారు అదే మన సినిమా లో బాలయ్య వాడలా అది ఎక్కేసి అలా క్రీపూ 7000 సంవత్సరాల క్రితాని కి వెళ్ళండి . వెళ్ళారా ? ఏమి కనిపిస్తుంది అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేటాడి , లేదా దొరికిన కొమ్మలు , ఆకులు , పళ్ళు , కాయలు (అదేలెండి మన సలాడ్ స్టైల్ గా ) తింటున్నారు కదా. ఒకే ఇప్పుడు కొంచెం ముందుకు రండి ఏమి కనిపిస్తుంది అదేలెండి గుంపులు గుంపులు గా కలిసి వేటాడటం , లేదా ఏదో ఒక పంట పండించటం చేస్తున్నారు కదా ? ఇంకా కొంచెం ముందుకు రండి ఇప్పుడు కొంత మంది వ్యవసాయం చేస్తున్నారు , ఇంకొంత మంది వాళ్ళకి కావాల్సిన పనిముట్లు తయారు చేస్తున్నారు , కొంత మంది పిల్లల సంరక్షణ వగైరాలు చేస్తున్నారు కదా . అదండీ అక్కడ పడింది మొదటి బీజం మన వృత్తుల వర్గీకరణ కి . సరేలెండి ఇక మన టైంమెషిన్ లో పెట్రోల్ అయ్యిపోయ్యేట్లు ఉంది . ఇక మన బ్లాగుల కాలానికి వచ్చేయండి .

వచ్చేసారా ఇప్పుడు ఒక సారి మీ చిన్నతనాన్ని ఊహించుకోండి బావుంది కదా హాయి గా తినటం , తిరగటం :) సరే ఆ రెండేనా కొంచెం చదువు కూడా కావలిగా ఒక సారి మీ పుస్తకాల బ్యాగ్ గుర్తుతెచ్చుకోండి , ఏమి సబ్జేక్ట్లు ఉండేవి , సైన్సు , సోషల్ , తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , మాధ్స్ యిలా కదా ? సరే పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఏమి సబ్జక్ట్స్ చదువుతున్నారో ఒక సారి గుర్తు తెచ్చుకోండి లేని వాళ్ళు అదేనండి పక్కింట్లో ఉంటారు కదా ఆ పిల్లల పుస్తకాలు చూడండి , ఆశ్చర్యం గా ఉంది కదా ఒక నాలుగు రకాల సైన్సులు, ఒక నాలుగు రకాల సోషల్లు ఇంకా ఏవేవో సరే కాసేపు అది అలా వదిలేద్దాం. ఇప్పుడు ,ఆసుప్తత్రుల గోల చూద్దాం మీ చిన్నప్పుడు మీకు జలుబు , జ్వరమో వస్తే మీ ఆమ్మమో , తాతో డాక్టర్ తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయిస్తే మరుసటి రోజుకి గంతులు వేసే వాళ్ళు కదా, మరి ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ కి వెళదాం రండి , ఇక్కడే సందేహం కదా ఎవర్నీ కలవాలి జనరల్ ఫిజీషియన్ , అక్కడనుంచి జలుబు కాబట్టి పల్మనాలజిస్టు కి చూపిస్తే బెటర్ , వామ్మో కొంచెం వణుకు కూడా వుంది న్యురాలజిస్ట్ , కాదు కాదు కొంచెం గుండె దడ కూడా కార్డియాలజిస్ట్ అబ్బ ఎంత కన్ఫుజన్ . సరే ఆ రెస్టారెంట్ లో కొంచెం ఏమన్నా తిండి తిని దీని సంగతి చూద్దాం . ఇక రెస్టారెంట్ లో చైనీసు , ఇటాలియన్ , సౌత్ ఇండియన్ , నార్త్ ఇండియన్ ఇంకా ఇంకా . ఇక చాల్లెండి మీకు అర్ధం అయ్యింది కాదా, ప్రస్తుతం మనం ఉంది స్పెషలైజేషన్ యుగం లోనని .

ఇప్పుడు ఈ పైదంతా చదివాక మీకేమి అర్ధం అయ్యింది ? ఏంటి ఏమి అర్ధం కాలేదా ? మరీ అంత మొహమాటం లేకుండా చెప్తే నాకు బాధ వేయదండీ ? సరే ఏమి చేస్తాను నేనే చెబుతా . కాలం తో పాటు గా మన జీవనశైలి లో సంక్లిష్టత పెరిగి దాని కోసం అని మన జీనానికి అవసరమైన పనులన్నీ మనమే చేసుకోలేక రకరకాలు విడగొట్టి పంచుకున్నామన్న మాట అంగీకరిస్తారు కదా ? కాకపొతే ఇక్కడే మనకి కొంచెం పాత , కొత్త పనులు అనేవి ఉన్నాయి . మనకెప్పుడూ పాత ఒక రోత కొత్తొక వింతా కాబట్టి , సాధారణం ఏమి చేస్తాము కొత్త వాటి వెంట పరుగు అందుకుంటాము . అలాగని పరుగు అందుకని ఊరుకుంటామా? లేదు, అబ్బే ఇది లేకపోయినా పర్వాలా , వెనకటి రోజుల్లో మేము లేమా ? ఇదీ మన ఆలోచన , ఇది సహజం !కాకపొతే మనం ఇక్కడ మర్చిపోయే విషయం ఏమిటంటే దీని వల్ల కలిగే సౌకర్యాలు , అలాగే ఇవాళా మనకి అంత అవసరం గా కనిపించని ఇవే అవసరాలు రాబోయే తరాలకు కనీస అవసరాలు గా మారతాయి అని .

ఒక ఉదాహరణ చెబుతా ఎప్పుడో నేను పుట్టక పూర్వం పొలాలలో వరి నూర్పిడి మనుషులు చేసేవారట , కాని ఇప్పుడు నాకైతే ఎక్కడా కనపడలేదు , ప్రతి దగ్గర ట్రాక్టర్ తోనే . ఒకసారి ఊహించండి ఇప్పుడున్న పరిస్తితులలో మనుషులతో అది సాధ్యమా ? ఎన్ని రోజులు చేస్తారు ? ఎంత కూలీ కడతారు ? ఇక ఇప్పటి కాలం లో ఐతే చాలాచోట్ల నాట్లు , కోతలు కూడా మెషిన్ సాయం తోనే . నిజం గా ఒక్కసారి ఊహించండి ఇది మనిషి శ్రమ ని మేధస్సు తో తగ్గించటం కదా ? నా చిన్నపుడు కొన్ని జోక్స్ చదువుతుండే వాళ్ళం ఈ రోజు వర్షం పడుతుంది అని రేడియో లో చెబితే వడియాలు చేయాటానికి రెడీ అవ్వండీ అంటూ . ఇవాళ పరిస్తితులు మారలేదా ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి అనేది లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు , అలాగే ఒక వారం ముందే ఈ రోజు వాతావరణ పరిస్తితి ని తెలుసుకోగలుగుతున్నాం దేని వల్ల ఇది సాధ్యం ? ఆ మేధస్సు కి విలువ అక్కరలేదా ?

ఇక మా తాత చిన్నప్పుడు చెబుతుండే వారు ఆయనకి ఏదో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం వస్తే వాళ్ళ నాన్న బస్తా వడ్ల ఖరీదు చేయదు ఆ ఉద్యోగం ఎందుకు అని పంపలేదని . మీలో ఎంత మంది ఇలాంటివి విని ఉంటారో చెప్పండి ? రేపెప్పుడో నేను నా మనవరాల్లలో , మనవళ్ళకో చేబుతానేమో , నన్ను మా అమ్మ నాన్న వ్యవసాయం చేయనీయకుండా ఇదుగో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేసారు అని :) ఇలా చెప్పటం లో నా ఉద్దేశ్యం ఒక్కొక్క కాలం లో ఒక్కొక్క వృత్తికి డిమాండ్ ఉంటుంది , అది రేపు ఏలా అన్న మారొచ్చు అని .దాని ప్రకారమే జనాలు choose చేసుకునే ప్రాధాన్యత క్రమం మారుతుంది అంత మాత్రానా ఈ వృతి మాత్రమే గౌరవనీయమైంది , వేరేది కాదు అనేది ఉండదు . అలాగే ఒక వృత్తి ని చేపట్టే వాళ్ళంతా ఉత్తములూ కాదు , వేరే పనులు చేసే వాళ్ళు కొంచెం తక్కువ కాదు . ఎవరైతే నిబద్దతతో వాళ్ళ వృత్తిని చేస్తారో వాళ్ళే గౌరవనీయులు, వాళ్ళ వల్లే ఆ వృత్తికి గౌరవం లబిస్తుంది .
మీరు మీ జీవితం లో ఒక్క రోజు మీ దినచర్య ని గమనించండి అది సక్రమం గా సాగటానికి ఎంతమంది సేవలు అవసరమో కూడా ఉహించండి . వారిలో ఏ ఒక్కరు సరిగా వాళ్ళ పని చేయక పోయిన ఎంత చిరాకు వేస్తుందో ఆలోచించండి . మనం ప్రస్తుతం గడిపే సామాజికజీవనం లో మనకు అనేక మంది సేవలు అవసరమవుతాయి , అలాగే మన సేవలు వేరే వాళ్లకి అవసరమవుతాయి సో ఒకరి మీద ఒకరు ఆధారపడక తప్పదు, ఈ ఆధారపడటం లో కొంచెం ఎక్కువ , కొంచెం తక్కువ అనే వర్గీకరణ అంత సబబు కాదు అని నా ఉద్దేశ్యం .
పైన నున్న లింకులలో రాసిన బ్లాగరుల అంత చక్కగా నేను రాసి ఉండక పోవచ్చు కాని నేను చెప్పదలుచుకున్న విషయం మాత్రం "ప్రపంచం లో వేరే వాళ్ళకి హాని కలిగించని ఏ వృత్తి ఐనా గౌరవనీయమైనదే నిబద్దతతో పనిచేసే వ్యక్తుల వల్ల ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది !".