రండి రండి మీరందరూ సోషల్ స్టడీస్ పాఠాలు చదివి చాలారోజులు అయిపొయింది కదూ ? 9th ఆగష్టు సింగపూర్ నేషనల్ డే అంటే సింగపూర్ పుట్టినరోజు !అందుకే ఈ వారం అంతా, నేను మీ అందరితో సింగపూరు చరిత్ర చదివించాలి అని కంకణం కట్టుకున్నా . ఇక మీకు తప్పదు.:-).
ఏదో పైపైన రెండు లైన్లు చదివి విండో క్లోజ్ చేయటమో , ఒక కామెంట్ పెట్టటమో కాదు , చదివి exam రాయాలి మీరందరూ . ఏంటి బహుమతా ? .....ఉన్నాయండి, ఫస్ట్ , సెకండ్ , థర్డ్ ప్రైజెస్ , ఆకర్షణీయమైన ఆ గిఫ్ట్లు మొత్తం పోస్టు చదివితే తెలుస్తాయి , కానీయండి మరి !
మనం వెస్ట్రన్ స్టైల్ లో పిలుస్తున్న సింగపూర్ అసలు పేరు సింగపుర . ఈ పేరు రెండు మలయ్ (మూలం సంస్కృతం) పదాలైన సింగ (సింహము) మరియు పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక ఆధారాల ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు "సంగ్ నిల ఉతమ" ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల లాగా ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట(ఇప్పుడు లేవులేండి మీరు అర్జెంట్ గా వెతకటం మొదలుపెట్టి కష్టపడొద్దు ) .
భౌగోళిక లక్షణాలు :
దక్షిణ ఆసియా లో (మలేషియా , ఇండోనేషియా దేశాల మధ్య) ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాలతో కూడిన అతి చిన్న దేశము సింగపూర్. సింగపూర్ మొత్తం విస్తీర్ణం 704 చదరపు కిలోమీటర్లు , అయితే ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా క్రమేణా పెరుగుతూ వస్తుంది . ఈ విస్తీరణ చిన్న చిన్న దిబ్బలా ఉన్న దీవులని , కొండ ప్రాంతాలని నివాసయోగ్యం గా మార్చటం ద్వారా జరుగుతుంది . ఇండోనేషియా పక్కనే ఉన్నప్పటికీ , ఆ దేశం లో ఉన్న ఫాల్ట్ లైన్ కి కొన్ని వందల కిలోమీటర్ల దూరం లో ఉండటం వల్ల seismic activity వల్ల పెద్ద ప్రమాదం లేదని అంచనాలు , అలాగే సముద్రం పక్కనే ఉన్నప్పటికీ "సమత్రా లాండ్ మాస్" వల్ల 2004 లో వచ్చిన అతి పెద్ద సునామీ నుండి సురక్షితం గా బయటపడింది .
భూమధ్య రేఖకి 100 మైళ్ళ కన్నా తక్కవ దూరం లోనే ఉండటం వల్ల , ఇక్కడ రాత్రి , పగలు కాలాలు సమానం గా ఉంటాయి . అలాగే సంవత్సరం అంతా ఒకే రకమైన వాతావరణ పరిస్టితులు ఉంటాయి . ఈ సమయమలో నైనా వర్షం కురవోచ్చు . గాలిలో తేమ శాతం అధికం గా ఉంటుంది (సరాసరిన 90 % శాతం ).
ఆర్దిక అంశాలు :
ప్రపంచ దేశాలలో ఆర్ధికంగా 13వ స్థానంలో స్థానం సంపాదించింది . అంతర్జాతీయ వ్యాపార రంగంలోనాలుగు ఆసియా టైగర్స్ గా వర్ణించబడే దేశాలలో సింగపూరు ఒకటి (మిగిలినవి వరసగా హాంగ్‌కాంగ్, కొరియా ఇంకా తైవాన్). ఇంకా విదేశీమారక వ్యాపారరంగంలో పేరుపొందిన వ్యాపార అంతర్జాతీయ కేంద్రాలైన లండన్, న్యూయార్క్ , టోక్యో ల సరసన చేరింది.
ఎంట్రీపోర్ట్(tax free)వ్యాపార విధానాల వలన ఆర్ధికరంగాన్ని చక్కదిద్దుకున్న దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ఆదాయంలో 26 శాతం రాబడి పరిశ్రమల (ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ,బయో మెడికల్ సైన్స్ ) ద్వారా వస్తుంది . .. సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది . అత్యంత వ్యాపారానుకూల దేశంగా కూడా సింగపూరు కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది .
సంస్కృతి :
సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు,మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీవాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజం. వివిధ మతాల ఆలయాలు ఇక్కడి మిశ్రమ మత సంప్రదాయానికి ప్రతీకలు.
సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే చైనా టౌన్ ,లిటిల్ ఇండియా ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయాలకు గుర్తులు . ఇవి ఈస్టిండియా కంపెనీ కాలంలో ఇక్కడ పనులు చేయడానికి దేశాంతరాలనుండి వచ్చి స్థిరపడిన పౌరుల నివాసాలు. చైనీయులు, ఇండియనులు ఇక్కడ నివాసముంటారు. చర్చులు, హిందూకోవెలలు, మసీదులు, బౌద్ధ దేవాలయాలు కూడా ఇక్కడి ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వీటిని కాపాడవలసిన పురాతన చిహ్నాలుగా ప్రభుత్వం భావిస్తుంది.
హిందూ, చైనీస్ సంసృతులకి సంభదించిన దేవాలయాలు సాధారణం గా అన్ని ప్రదేశాల్లో పక్కన పక్కనే ఉండటం ఇక్కడ సాధారణం గా కనపడుతుంది . హిందూ దేవాలయాల్లో తమిళ సాంప్రదాయ పద్దతులలో పూజలు నిర్వహిస్తారు .సింగపూరు జాతీయ భాష మలయ్, జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట అమెరికన్ యాసతో ప్రభావితమైన ఇంగ్లీష్ ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది అలా ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం.
చరిత్ర :
ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్(సముద్ర పురము) అనే పేరుతో క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరవాత క్షీణదశ ఆరంభమైంది ( పురాతన అవశేషాలు మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు). 16వ శతాబ్ధము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో (మలేషియా) ఒక భాగంగా ఉంది. ఆ సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉండేది .
1819వ సంవత్సరము లో "థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్" భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. ఈయనని ఆధునిక సింగపూర్ రూపకర్త గా చెప్పవచ్చు , ఈయన పేరు మీద ఏర్పడిన raffles place ఏరియా ప్రముఖ వాణిజ్య సముదాయలకి నెలవు . దీనినే డౌన్ టౌన్ అని కూడా అంటారు.అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. 1858 వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన 1867 వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు పాలన లో కి వచ్చింది . బ్రిటిష్ కలోనీ నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల,బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.
రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము 1942 వ సంవత్సరము 6 రోజుల యుద్ధము తరవాత జపాను సైన్యంచే ముట్టడించబడి జపాను వశమైంది. 1945 వ సంవత్సరము సెప్టెంబర్ 12 వ తేదీన జపానీయుల లొంగుబాటు తరువాత తిరిగి ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వశపరచుకుంది. 31 August 1963 లో బ్రిటన్ నుంచి Federation of Malaysia లో భాగం గా స్వాతంత్ర్యం పొందింది . తరవాత రెండు సంవత్సరాల తరవార ఒప్పందాల ప్రకారంమలేసియా నుంచి విడిపోయి 9th ఆగష్టు 1965 న రిపబ్లిక్ అఫ్ సింగపూర్ గా ఏర్పడింది .
రాజకీయ అంశాలు :
సింగపూర్ పార్లమెంటరీ రిపబ్లిక్ అయినప్పటికీ అదికార పార్టీ అయిన PAP (పీపుల్ ఆక్షన్ పార్టీ ) 1965 నుంచి ఇప్పటికి వరకు వరుస గా ఎన్నిక అవుతూ వస్తుంది . ప్రతిపక్ష పార్టీ ప్రభావం తక్కువే అయినప్పటికీ , 2011 లో జరిగిన ఎన్నికలలో మాత్రం ఓటింగ్ శాతాన్ని గతం లో పోలిస్తే గణనీయం గా పెంచుకుంది . ప్రధాన ప్రతిపక్ష పార్టీలు (SDP & SDA) కలిసి పోటీ చేయటం వలన ఇది సాధ్యమైంది అని విశ్లేషకుల అంచనా .
సింగపూరు అతితక్కువ అవినీతి కలిగిన దేశంగా ఆసియాలో ప్రధమ స్థానంలోను, అంతర్జాతీయంగా పదవ స్థానంలోనూ ఉంది. సుస్తిరమైన రాజకీయ పరిస్తితులు , పాలకుల విచక్షణ , పరిపాలనా దక్షత దీనికి కారణాలు గా చెప్పవచ్చు .
సింగపూర్ లో రెండు రకాలైన ELECTORAL DIVISIONS ఉంటాయి .
1 . Single Member Constituencies (SMC ) : ఇవి సాధాణం గా జనాభా లోను , విస్తీరణం లో చిన్నవి . ఈ పార్లమెంటరీ డివిజన్ ని కేవలం ఒక MP రేప్రజేంట్ చేస్తారు . అంటే ప్రజలు ఒక MP ని మాత్రమే ఎన్నుకుంటారు . ప్రస్తుత SMC ల సంఖ్య - 12.2 Group Representation Constituencies (GRCs): విస్తీరణం లోను , జనసాంద్రత లోను పెద్దవి . 3 - 6 మంది MP లను ప్రెసిడెంట్ నియమిస్తారు . ఈ మొత్తం సభ్యులలో ఒకరు తప్పని సరి గా మైనార్టీ రేస్ నుంచి ఉంటారు . ప్రస్తుత GRC ల సంఖ్య - 15 .
MP గా పోటీ చేయటానికి అభ్యర్ధి తప్పనిసరిగా పొలిటికల్ సైన్సు తప్పని సరి గా చదవి ఉండాలి .
అంతర్జాతీయ సంబంధాలు :
సింగపూరుకు దరిదాపు 175 దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. సింగపూరుకు ఐక్యరాజ్యసమితిలో, కామన్వెల్త్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో సభ్యత్వము ఉంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందము ఉంది. సింగపూర్ యునైటెడ్ కింగ్‌డమ్ తో , అమెరికాతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది, అలాగే అనేక దేశాలతో విసృత వ్యాపార ఒప్పందాలను కలిగి ఉంది.
విద్య
సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. , మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను (హిందీ, తమిళ్ , మాండరిన్ వంటివి)రెండవ భాషగానూ బోధిస్తుంటాయి. కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ బోధిస్తూ ఉంటాయి.విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్డెన్ (ప్రాధమిక విద్యకు ముందు తరగతులు) తరవాత 6 సంవత్సరాల primary education ఉంటుంది . స్కూల్ లీవింగ్ పరీక్షల (PSLE) తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల Seconday Education అనంతరం N లెవెల్ లేక O లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్ colleges 2 నుండి 3 సంవత్సరాల ప్రి యునివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి. దీని తరవాత మాస్టర్స్ కోర్సులు చేయటానికి అర్హులు . నిరుద్యోగ శాతం 1 .5 శాతం మాత్రమే కావటం తో ఎక్కువ మంది ప్రీ యునివర్సిటీ కోర్సులు కాగానే ఉద్యోగాలలో చేరటానికి మక్కువ చూపుతారు .
రక్షణ వ్యవహారాలు
సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(MINDEF)ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి. వీటికి సివిల్ డిఫెన్సు వంటి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తాయి.ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోని వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం స్వయంగా నిర్ణయించుకోవచ్చును.సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను అమెరికా, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ చైనా, న్యూజిలాండ్, బ్రూనై, ఫ్రాన్స్, థాయిలాండ్, భారత్ మరియు దక్షిణాఫ్రికా లలో నిర్వహిస్తుంది. 1991 సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల వ్యూహాన్ని తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ లో నలుగురు హైజాకర్స్ ప్రాణాలు కోల్పోయారు . ఇది వీరి ప్రతిభ కి ఒక మచ్చు తునక .
సాధారణ ప్రజల జీవన విధానం , పర్యాటక విశేషాలు రెండో భాగం లో తెలుసుకుందాము ...... అంత వరకు take a break :)