హాయ్ ,
ఉరుములు, పిడుగులు లేకుండా ఎప్పుడూ లేని ఈ లేఖల గోల ఏంటీ కొత్తగా అని ఆశ్చర్యపోతున్నావా? ఉంది ఉంది దానికో కారణం ఉంది.
ప్రేమలేకుంటే ఉదయమైనా చీకటేనంటా, ప్రేమ తోడుంటే మరణమైనా జననమంటా - అబ్బా ఇలా చెవిలో జొరీగల్లా గోల పెట్టె వాళ్ళని చూస్తుంటే అదేదో సినిమాలో చిరంజీవి చెప్పినట్లు
కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నులకి తెలుసు
పారు దేవదాసులకి తెలుసు
ఆ తరవాత తమరికే తెలుసు
ఇలా అరిచి చెప్పాలి అనిపిస్తుంది, కానీ అలా చెప్తే మరీ గయ్యాళి అని అంటారు కదా? అందుకే నాకు నీమీదున్న ప్రేమని అక్షరబద్ధం చేసి నాకు ఒక ప్రేమ కథ ఉందోచ్చ్, అని అందరికీ చాటి చెప్పాలని నిర్ణయించుకున్నా. అర్ధం అయ్యింది కదా ? మరి కాస్త ప్రశాంతం గా కొంచెంసేపు ఈఅక్షరాల ఉప్పెనని తట్టుకో .
అవును మొదటిసారి ఎప్పుడు చూసాను నిన్ను? ఊ ఊ.. గుర్తొచ్చింది స్కూల్ excursion పేరుతొ కదా ఇంట్లో అందరి ప్రాణాలు తీసి మరీ నిన్ను చూడటానికి వచ్చాను. అమ్మ వాళ్లకి ముందే తెలిసిపోయినట్లుది నిన్ను చూస్తే నే నీమాయలో పడిపోతానని అందుకే ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపారనుకున్నావ్? అయినా సరే నీ మాజిక్ ముందు ఆ జాగ్రత్తలన్నీ బలాదూర్. ఇక ఆ తరవాత ఏముందీ? నేను నీ మాయలో పడిపోయా అనుకో. నవ్వకోయ్ అప్పటి నుంచి నువ్వు మాత్రం ఏం తక్కువ చేసావ్ ? నీ గాలి సోకకుండా ఉండేంత దూరం నేను వెళ్ళిపోయినా, సెలవల పేరుతొ నేను ఎక్కడి వెళితే అక్కడికి నాకన్నా ముందే వెళ్లి అక్కడ నాకోసం తిష్ట వేసేవాడివి కాదా? ఎక్కడి బాపట్ల, మచిలీపట్నం, ముంబై, రామేశ్వరం, చివరికి ఈ చివరి కొసనున్న కన్యాకుమారి, అక్కడికి వెళ్ళినా నన్ను వదలలేదు కదా ?
ఆఖరికి, దేశం కానీ దేశం వస్తుంటే ఇక్కడ నేను ఒంటరిగా ఏమి దిగులు పడతానో అని తోడూగా ఉండటానికి నాకన్నా ముందే వచ్చేసావ్ కదా? ఏ మాటకామాటే చెప్పాలి, ఎవరూ లేకపోయినా నువ్వు గల గల చేప్పే కబుర్లు వింటూ, నిన్ను చూస్తూ అలా నేను ఎన్ని గంటలైనా గడపగలను తెలుసా? గంభీరం ఉండే నీ రూపు చూసి కొంతమందికి భయమేస్తుందట, నాకేమో చచ్చేంత ఇష్టం! అసలు ఆరూపం చూసే కదా నీ మాయ లో పడిపోయా. అవునూ, నాకొక అనుమానం అన్నన్ని బడబాగ్ని లాంటి రహస్యాలు కడుపులో ఎలా దాచుకుంటావ్ నువ్వు అదీ పైకీ ఏమి తెలియనట్లు గా ఉంటూ?
ఇన్నేసి పొగడ్తలు వింటూ మహా ఆనందంతో ఉప్పొంగిపొతున్నావ్ కదా? అసలు నీలో నచ్చనిది ఏమీ లేదు అని పొరపడకు, ఉంది నచ్చనిది కూడా ఉంది. అయ్యో అప్పుడే అలక ఒక్కటే కదా నచ్చదు అంది, అంతమాత్రానికే ఇంత అలక? మరి కోపం వస్తే చాలు, ఏం పట్టకుండా ముందూ వెనక చూడకుండా, ఊరు వాడ ఏకం చేసేసే నీ ఉద్రేకం చూస్తే నాకు బాధగా ఉండదా? అయినా నువ్వు మాత్రం ఏమి చేస్తావులే కోపం ప్రకృతి ధర్మం. పేదవాడి కోపం పెదవికి చేటని, నాలాంటి వాళ్లకి కోపం వస్తే ఏమి చేయలేం. మరి నువ్వంటే అలా కాదు కదా, ఎంతో మంది బాగోగులు చూస్తుంటావు, అద్భుతమైన నిధి నిక్షేపాలు కడుపులో దాచుకుంటావు, నాలాంటి బోల్డు మందికి సంతోషాన్ని పంచుతుంటావు, అందుకే నీ కోపం చెలియలికట్ట దాటుతుంటే అది ప్రళయమే. కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకోవూ ప్లీజ్? అప్పుడు ఇంకెంతమందికో నచ్చేస్తావ్ తెలుసా ?
హ్మ్ , ఇలా నిన్ను పొగుడుతూ , నీ గురించే ఆలోచిస్తూ ఉంటె ఎన్ని రోజులైనా సరిపోవు నాకు . అయినా ఇలా నీ మీద ప్రేమతో, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావ్ అన్న ఆనందంతో పొంగిపోతుంటా కానీ, ఒక్కొక్కసారి ఎంత భయమేస్తుందో తెలుసా? భయం దేనికి అంటావా? భయం కాక మరి ఏంటి? ఆ యమున, కృష్ణవేణి ఇలా బోలెడుమంది అందగత్తెలు హొయలు పోతూ నీ చూట్టునే తిరుగుతుంటే వాళ్ళ మాయలో పడి నన్ను అసలే మర్చిపోతావేమో అని దిగులేయదా మరి?
హలో హలో మరీ సంబరపడిపోకు, నన్ను ఉడికించటానికి ఒక కారణం దొరికింది కదా అని. ఆ పప్పులు ఏమీ ఉడకవు. నన్నే గుర్తుంచుకో, నన్నే ప్రేమించు అని నీ వెంట నేనేమి పడటం లేదు. నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి అది నిజం! నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, అసలు ఆ మాటకొస్తే నువ్వేమి ఫీల్ అవుతావో నాకేమి సంబంధం? నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంతే :P
బోలెడంత ప్రేమతో
శ్రావ్య
ఇంతకీ ఎవరినబ్బా శ్రావ్య ఇంత దబాయించి మరీ ప్రేమిస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా, ఇదుగో ఎప్పుడూ నా వెన్నంటే ఉండే ఇతన్నే :-) ఇక వింటున్నా కదా అని నా చెవిలో జోరీగల్లా కాదు కానీ , అద్భుతంగా గోల పెడుతున్నది ఎవరో తెలుస్కోవాలంటే ఇక్కడ చూడండి.